నాలుగో తరగతిలోనే క్రష్.ష్..ష్… ‘మహేష్’ అతడు డైలాగ్ గుర్తుకొస్తోందా?

శైలజారెడ్డి అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ కూతురిగా, చై పక్కన హీరోయిన్‌గా ప్రధాన పాత్రలో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్‌ ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలే చెప్పుకొచ్చింది. పవన్‌కల్యాణ్‌, అల్లుఅర్జున్‌, నాని వంటి ప్రముఖ హీరోల పక్కన నటించిన ఈ భామ తమిళంలో ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. 12 సంవత్సరాలకే మొదటిసారి నటించే అవకాశం వచ్చినా, చదువు కోసం అమెరికా వెళ్లిపోయానని, తర్వాత డిగ్రీ చదివే రోజుల్లో మలయాళం సినిమాతో కెరీర్ మొదలెట్టానని చెప్పుకొచ్చింది.

నిజంగా నిజమే చెప్పిందో, లేక ఇతర కారణాలు ఉన్నాయో కానీ తనకు నాల్గవ తరగతి చదివేటప్పుడే తొలి క్రష్ ఏర్పడిందని చెప్పింది. కొందరైతే ఇది విన్న వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా, మహేష్ హీరోగా తెరకెక్కిన అతడు చిత్రంలో త్రిష డైలాగ్ గుర్తుకొచ్చిందంటూ కళ్లు తేలేస్తున్నారు. పదేళ్లకే అన్నీ చూసేస్తే, పాతికేళ్లకు టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తారు అని. ఇప్పుడీవిడ సినిమాలు చేసుకుంటూ, పెళ్లి, ప్రేమలను దూరం పెట్టేసింది కాబోలు.

ప్రభాస్, బాలయ్య, రానా – ముగ్గురూ ఉత్తములే..

సౌత్ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఏడో ఎడిషన్ కార్యక్రమం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల నుండి ప్రముఖ నటులంతా ఈ కార్యాక్రమంలో సందడి చేస్తున్నారు. సైమా అవార్డులు అందుకున్న తెలుగు సెలబ్రిటీల జాబితాను ఈ సందర్భంగా సైమా ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.

ఈ జాబితాకు ఇక్కడి ఫోటోకు అస్సలు సంబంధం లేదు. ఈ అవార్డుల ఫంక్షన్‌కు ఈ ముదురుభామ ఈ మేకప్‌లో, ఈ దుస్తుల్లో ఈ విధంగా అందాలవిందు చేసిందని చెప్పేందుకు మాత్రమే.
ఇక్కడే ఆగిపోకుండా అవార్డు విన్నర్లు ఎవరో ఓసారి చూడండి.

ఉత్తమ నటుడు: ప్రభాస్‌ (బాహుబలి)
ఉత్తమ నటుడు (క్రిటిక్): నందమూరి బాలకృష్ణ
ఉత్తమ నటుడు (నెగిటివ్‌ రోల్‌): రానా దగ్గుబాటి (బాహుబలి)
ఉత్తమ నటి: కాజల్‌ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి)‌
ఉత్తమ సహాయ నటి: భూమిక
ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (మేల్‌): మాధవన్‌
ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి
ఉత్తమ హాస్యనటుడు: రాహుల్‌ రామకృష్ణ
ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (ఫీమేల్‌): హన్సిక
ఉత్తమ చిత్రం: బాహుబలి
ఉత్తమ పరిచయ నటుడు: ఇషాన్‌
ఉత్తమ పరిచయ నటి: కల్యాణి ప్రియదర్శన్‌ (హలో)
ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్‌ రెడ్డి వంగా (అర్జున్‌ రెడ్డి)
ఉత్తమ నిర్మాత: రాజీవ్‌ రెడ్డి ‌(గౌతమిపుత్ర శాతకర్ణి)
ఉత్తమ దర్శకుడు: ఎస్‌ ఎస్‌ రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి
ఉత్తమ గాయకుడు: కాల భైరవ
ఉత్తమ గాయని: మధు ప్రియ
ఉత్తమ పాటల రచయిత: సుద్దాల అశోక్‌ తేజ
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: సెంథిల్‌ కుమార్‌

వరదలకు, సన్యాసిని రేప్‌కు సంబంధమేంటి? సిగ్గులేదా అసలు??

తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరోకు పదేపదే నోరు, చేయి పడేసుకోవడం అలవాటు. చెంపలు పగిలినవాళ్లు, ఫోన్లు పగిలినవాళ్లు.. అంతకు మించి బుల్లెట్లు దిగినవాళ్లు కూడా ఆయనే మా హీరో.. నేనే ఇబ్బంది పెట్టానంటూ సదా కృతజ్ఞులై ఉంటారు. మీడియా మిత్రులు సైతం ఆయన నోటి బూతుల ధాటికి బలైనవాళ్లే. అందుకే ఆయన ముందు వీళ్లు కుప్పిగంతులు వేయరు. బహుశా మలయాళ సూపర్‌స్టార్ ఇకపై ఆ పంథాలో పోతే మంచిదేమో.

వివరాల్లోకి వెళ్తే.. మలయాళ హీరో మోహన్‌లాల్ కేరళ వరద బాధితులకు సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, ఓ మీడియా మిత్రుడు క్రైస్తవ సన్యాసినిపై జరిగిన రేప్ గురించి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరాడు. ఇక లాల్ ఏట్టన్ అతనిపై ఓ రేంజిలో విరుచుకుపడిపోయాడు.

వరదల గురించో, భవిష్యత్ ప్రణాళికల గురించో ప్రస్తావించకుండా, కార్యక్రమానికి సందర్భానికి అసలు సంబంధమే లేకుండా మరేదో అడిగేందుకు సిగ్గు లేదా అనేసారు. మంచి విషయాల గురించి మాట్లాడుతుంటే మీరు అత్యాచారం గురించి అడుగుతారేంటి? అసలు నేను వచ్చిన పనికి, క్రైస్తవ సన్యాసినులకు ఏమన్నా సంబంధం ఉందా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్‌లాల్ ఆ తర్వాత విలేఖర్ల సమావేశానికి డుమ్మాకొట్టి అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయారు.

తుఫాన్ గాలిలో ఊగిపోతూ రిపోర్టర్ ఓవరాక్షన్… అసలు గుట్టు ఏమిటంటే…

టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు విరివిగా ఉపయోగించే మాట – పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్ల వల్ల నిజమైన మీడియాకు విలువ లేకుండా పోతోంది .. అని. కానీ ఇదే మీడియా ఛానెళ్లు మాత్రం వేసిన వార్తలను పదే పదే వేస్తూ, అసభ్యమైన అశ్లీలమైన కామెంట్లను రిపీటేస్తూ కాలక్షేపం చేసేస్తూ, టిఆర్‌పిలను పెంచుకుంటాయనేమాట జగద్విదతమే.

అప్పట్లో త్రిష వీడియో అంటూ హల్‌చల్ చేసిన ఓ వీడియోని ఓ ప్రముఖ ఛానెల్‌లో టీవీ పెట్టేందుకే భయపడేంత రీతిలో నిమిష నిమిషానికి ఎన్నిసార్లు ప్రసారం చేసారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ తల్లిపై శ్రీరెడ్డి కామెంట్ల నుండి, తాజాగా శ్రీదేవి బాత్‌టబ్ మరణం సందర్భంలో ఓ ఛానెల్ రిపోర్టర్ బాత్‌టబ్‌లో పడుకుని, పడి, లేచి వార్తలను విశ్లేషించించడమూ ఎవరూ మర్చిపోలేరు. ఇక తెప్పలపై కేరళ వరదలను రిపోర్ట్ చేయడం ఓ పరాకాష్టేనని చెప్పుకోవాలి.

ఇప్పుడిదంతా ఎందుకంటే – అమెరికాలోని ఓ మీడియా సంస్థకు ఓ రిపోర్టర్ (మనోళ్లు ఇచ్చిన స్ఫూర్తితోనేమో) హరికేన్‌కు సంబంధించిన వార్తలను రిపోర్ట్ చేస్తున్నాడు. బలమైన గాలులు వీస్తున్నాయని, సరిగ్గా నిల్చోవడం కూడా సాధ్యం కావడంలేదంటూ ఊగిపోతూ వార్తలను రిపోర్ట్ చేస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఇద్దరు వ్యక్తులు తాపీగా నడిచిపోవడం కనిపించింది. దానితో ఇంతసేపూ ఊగిపోయిన రిపోర్టర్ ఓవరాక్షన్ బయటపడిపోయింది. ఐతే ఆ సంస్థ మాత్రం షరామామూలుగా తమ రిపోర్టర్‌ని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో, తమ రిపోర్టర్ తడిగడ్డిపై నిల్చొని రిపోర్ట్ చేసాడని, నడిచివెళ్లిన వ్యక్తులు కాంక్రీట్ రోడ్డుపై నడిచారని కాస్తా కవరింగ్ ఇచ్చారు.

తక్కిన సంగతులెలా ఉన్నప్పటికీ, ఇదిగో ఆ వీడియోని మీరూ ఓసారి చూసెయ్యండి –

లేవలేకపోయిన అనుష్క… విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడా..??

ఇండియన్ క్రికెట్ స్టార్, మిస్టర్ ఫిట్ విరాట్ కోహ్లీ త్వరలో తండ్రి కాబోతున్నాడనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన శ్రీమతి అనుష్క ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వరుణ్ ధావన్‌తో కలిసి హాజరైంది. ఆ సందర్భంగా ఆమె చాలా వదులైన దుస్తులు ధరించడం, తనని పలకరించేందుకు వచ్చినవారితో లేచి కరచాలనం చేయవలసిన సందర్భాల్లో కుర్చీలో నుంచి లేచి నిల్చుకోవడానికి ఇబ్బంది పడటం వంటివి చూసిన అభిమానులు ఆమె గర్భం దాల్చిందనే వార్తలకు శ్రీకారం చుట్టారు.

కానీ ఆమె లేచి నిల్చుకోలేకపోవడానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు ఆమె సన్నిహితులు. ఇదే ఫంక్షన్‌లో వరుణ్ సైతం కొన్నాళ్లుగా అనుష్క వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ హాజరయ్యారని తెలిపినప్పటికీ, అభిమానులు మాత్రం వినేలా లేరు.

విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఖాతాల్లో కామెంట్లు చేస్తున్నారు. అనుష్క గర్భం దాల్చిందనే వార్తలు గతంలోనూ వినిపించినా, అవి వట్టి పుకార్లేనని తేలిపోయింది. మరి ఈ తాజా వార్తలు నిజమా, పుకార్లా అనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.

అనగనగాతో అరవిందసమేత వీర రాఘవ.. స్పీడ్ అందుకున్నట్లేనా?

మాటల మాంత్రికుడు, క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భారీ చిత్రం అరవింద సమేత వీర రాఘవ. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్రయూనిట్‌ ఇప్పటికే ప్రారంభించింది. టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన యూనిట్ ఈ రోజు అంటే సెప్టెంబరు 15, శనివారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘అనగనగనగా’ అనే పాట ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేయనున్నట్టుగా ప్రకటించారు.

కథ ప్రారంభమయ్యేటప్పుడు అనగనగనగా అంటూ ప్రారంభించేలా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్రయూనిట్‌ ఈ పాటతో మరింత స్పీడ్ పెంచనుంది. ఇటీవల నందమూరి కుటుంబంలో సంభవించిన విషాదం కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ, అనుకున్న తేదీకి సినిమాని రిలీజ్ చేయాలనే పట్టుదలని యూనిట్ కనబరుస్తోంది. అనగనగా అనే పాట విషయానికొస్తే, ఈ పాటను ఆర్మన్ మాలిక్ పాడగా, థమన్‌ సంగీత సారథ్యం వహించారు.

రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు నటిస్తుండగా, ఇతర పాత్రల్లో జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా, సునీల్‌, రావు రమేష్ నటిస్తున్నారు.