Latest News
Silk Smitha : ఆ తప్పు వల్లనే సిల్క్ స్మిత అప్పుల పాలయ్యింది…
Silk Smitha : సిల్క్ స్మిత ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కానీ 1980, 90 దశకంలో పుట్టిన వాళ్ళకి ఆమె గురించి తెలుస్తుంది. తన నిషా కళ్ళతో సినీ ప్రేక్షకులను మత్తులో తూలేలా చేసిన నటి సిల్క్ స్మిత. తన అంద చందాలతో ప్రేక్షకులను సినీ ఊయలలో నిద్రపుచ్చిన సొగసరి. ఎన్నో సినిమాల్లో గ్లామరస్ పాత్రలు, డీ గ్లామరస్ పాత్రలు చేసిన అలనాటి నటి సిల్క్ స్మిత. అయితే ఎక్కువగా ఆమె గ్లామరస్ పాత్రలు, వాంప్ పాత్రలు, బార్ గర్ల్స్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్ డాన్సర్ పాత్రలు చేసేది. ఎంతో పేరు, డబ్బు సంపాదించుకున్న ఆమె చివరకు అప్పుల పాలై మరణించింది. ఈమె జీవితం ఆధారంగా హిందీలో ‘ది డర్టీ పిక్చర్’ పేరుతో సినిమా కూడా వచ్చింది. ఇటీవలే ‘దసరా’ సినిమాలో కూడా సిల్క్ స్మిత పోస్టర్లు కనబడతాయి.శృంగార తారగా సౌత్ ఇండియాను ఏలారు సిల్క్ స్మిత.
ఈ పల్లెటూరి అమ్మాయి సౌత్ ఇండియాను షేక్ చేశారు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి కాగా, అత్తింటివారి వేధింపులు తాళలేక చెన్నై పారిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. తెలిసినవారు లేరు. అక్షరం ముక్క రాదు. కేవలం బ్రతకాలి అన్న మొండితనం ఆమెను సినిమా వైపు అడుగులు వేసేలా చేసింది. ఒక్కో విషయం తెలుసుకుంటూ, నేర్చుకుంటూ స్టార్ అయ్యారు. వందల చిత్రాల్లో నటించారు. ఆకాశంలోకి రివ్వున దూసుకెళ్లిన తారాజువ్వలా వెలుగులు చిమ్మి అంతలోనే కనుమరుగైంది సిల్క్ స్మిత. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత 35 ఏళ్ల ప్రాయంలో కన్ను మూసింది. చెన్నైలో సిల్క్ స్మిత తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించింది. సిల్క్ స్మిత మరణం మీద అనేక పుకార్లు ఉన్నాయి. సిల్క్ స్మిత తో అనుబంధం ఉన్న సీనియర్ నటి కాకినాడ శ్యామల తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సీనియర్ నటి కాకినాడ శ్యామల దాదాపు 200 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఈమె నటిగానే కాకుండా నిర్మాతగా, ఫైనాన్షియర్ గా కూడా వ్యవహరించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె సిల్క్ స్మిత గురించి మాట్లాడారు.
కాకినాడ శ్యామల మాట్లాడుతూ… నేను చాలా సినిమాలకు ఫైనాన్స్ చేసా. సిల్క్ స్మిత సొంత సినిమాకి కూడా డబ్బులు ఇచ్చాను. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడక పోవడం వల్ల సిల్క్ స్మిత అప్పుల పాలయింది. ఒక్క సినిమాతోనే సిల్క్ స్మిత ఆస్తులన్నీ పోగొట్టుకుంది. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. తెరపై వేసే పాత్రలు వేరు, బయట కనిపించే సిల్క్ స్మిత వేరు. ఆమె నిజాయితీ ఉన్న మనిషి. ఆమెను హత్య చేశారని కొంతమంది అంటారు. ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. నిజానికి ఏం జరిగిందనేది ఆ పైవాడికి మాత్రమే తెలియాలి. ఆయన దృష్టిలో నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కానీ ఆమె ఎందుకు చనిపోయిందో కారణాలు తెలియవు. అయినప్పటికీ సిల్క్ స్మిత అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది. ఆ తర్వాత ఆమె కెరియర్ బాగానే సాగింది. అలాంటి సమయంలో ఆమె చనిపోయిందనే వార్త విన్న అని అన్నారు కాకినాడ శ్యామల.