మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు కథలతో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయో.. అందులోని పాటలు కూడా అంతే హిట్ అవుతాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా కూడా ఇదే జాబితాలో చేరుతుంది. అయితే ఆచార్య సినిమాకు సంబంధించినంత వరకు విడుదల అయ్యేంతవరకు చాలామందికి చాలా ప్రశ్నలకు సమాధానం లభించలేదు. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది.. మొదటిది.. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నామని ప్రకటించిన చిత్రబృందం సినిమాలో ఎక్కడా ఆ పాత్ర కనిపించకుండా చేయడం.. అంటే ఆ పాత్రని పూర్తిగా కథ నుంచి తొలగించారు. దీనికి కారణం ఏంటి అన్నది చాలామందికి వచ్చిన ప్రశ్న.

ముందుగా ఆచార్య సినిమా నుంచి విడుదల చేసిన ‘లాహే లాహే లాహే.. లాహే..’ పాటలో కూడా కాజల్ అగర్వాల్ నటి సంగీతతో కలిసి కాలు కదపడం మనం చూశాం. కానీ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం అవేవీ కనిపించలేదు. దీనికి కారణం సినిమా విడుదల తర్వాత దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ‘మెగాస్టార్ లవర్‌గా ఫన్నీగా ఉండే క్యారెక్టర్ మొదట కథలో రాసుకున్నాం. ఆ పాత్ర కోసం మొదట త్రిషని తీసుకున్నా కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత మేము కాజల్ అగర్వాల్‌ని ఎంపిక చేసుకున్నాం. కానీ షూటింగ్ జరుపుతున్న సమయంలోనే షూట్ చేయడం పూర్తయ్యాక సన్నివేశాలు చూస్తుంటే కాజల్ పాత్రకు అసలు స్కోప్ లేదనిపించింది. కథపరంగా ఆ పాత్ర అవసరం లేదని అనిపించింది.

అందుకే కాజల్ దగ్గరకు వెళ్లి ఈ పాత్ర కథకు అవసరం లేదనిపించింది. అదీ కాకుండా నటిగా అప్పటికే ఓ స్థాయిలో మిమ్మల్ని ప్రాధాన్యం లేని పాత్ర ద్వారా తక్కువ చేసి చూడలేను. దర్శకుడిగా నీ పాత్రకు న్యాయం చేయలేను.. అని చెప్పారట శివ. వెంటనే కాజల్ అది అర్థం చేసుకుని మరోసారి మంచి పాత్రతో తప్పకుండా కలిసి పనిచేద్దాం అని చెప్పిందట. అందుకే సినిమాలో ఎక్కడా మనకు కాజల్ పాత్ర కనిపించదు. అయితే ఈ సినిమా సమయంలోనే కాజల్‌కు పెళ్లై, ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో షూటింగ్ చేయడం కుదరక ఆమె పాత్రను పూర్తిగా తొలగించారన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. కానీ పాత్ర తొలగింపు వెనుక ఉన్న అసలు కథ ఇది.

కొణిదెల ప్రొడక్షన్ సంస్థ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే మణిశర్మ అందించిన స్వరాలు సంగీత ప్రియులను చక్కగా అలరించాయి. వాస్తవానికి ఈ సినిమా 2021, మే 13న విడుదల కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2022 ఫిబ్రవరికి వాయిదా పడింది. అప్పుడు కూడా కరోనా థర్డ్ వేవ్ ఉండడంతో సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేశారు. ఈ సినిమాకు అభిమానుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది.
