మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా, మహానటి కీర్తీ సురేష్, సుశాంత్ అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భోళాశంకర్. ఈ సినిమా నుంచి తాజాగా 3వ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిందీ చిత్రబృందం. ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ తమన్నా పెదవి పట్టుకుని మరీ రొమాన్స్ చేశారు చిరు. ఈ పాట ఆద్యంతం ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారనే అంశం ఆధారంగా సాగడం, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, వినసొంపైన మ్యూజిక్‌తో అభిమానులంతా మైమరిచిపోతున్నారు. మొదటి పాటతో మొదలైన భోళా మేనియా ప్రతి పాట విడుదలతోనూ అంతకంతకూ పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గడం లేదంటున్నారు అభిమానులు.
‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాయగా; విజయ్ ప్రకాష్, సంజన కల్మణి ఈ పాట పాడారు. పాట ప్రారంభంలో వచ్చే ‘అచ్చ తెలుగు పచ్చి మిర్చి మగాడు వీడు బంబాట్ హాట్ హటుగున్నాడే..’ అంటూ సాగే లిరిక్స్‌తో నిదానంగా మిల్కీ బ్యూటీ సాంగ్‌లోకి వెళ్తుంది. ఈ పాటకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం వినసొంపుగా అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ పై కనిపించే నటీనటుల కాస్ట్యూమ్స్, బ్యాక్‌గ్రౌండ్ సినరీస్.. కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఇట్టే అందరినీ ఆకట్టకుంటున్నాయి. ఇక ఈ పాటకు ముందు విడుదల చేసిన జామ్ జామ్ జామ్ జజ్జనక.. పాట కేవలం వినడానికే కాదు.. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తిసురేశ్, అక్కినేని సుశాంత్.. లతో స్క్రీన్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా మెరిసిపోయింది. ఇక మాస్ బీట్‌కి వీరేసిన స్టెప్స్ కూడా ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాదు.. ఈ పాటలోనే ప్రాచుర్యం పొందిన తెలంగాణ జానపద గీతం అయిన నర్సపెల్లె పాటకు నర్సపెల్లె గండిలోన గంగధారి.. నాటుపిల్లే కలిసినాది గంగధారి అంటూ మరో కొత్త వెర్షన్ కూడా వినిపించారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లి, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది.
అందుకే ఈ సినిమాలోని ఒక్కో పాటను వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు మూవీ టీం. అలాగే ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళాశంకర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాటతో అభిమానులంతా ఇంకా భోళా మానియాలో ఉండగానే జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే ఈ పాటతో ఒకేసారి పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోయారంతా. ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ సాంగ్‌తో అంతా మరింత ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా; చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. అక్కినేని సుశాంత్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పని కూడా ఇటీవలే పూర్తైనట్లు సోషల్ మీడియా వేదికగా అందరితోనూ పంచుకున్నారు.