Connect with us

సినిమాలో తన దుస్తులు తానే డిజైన్ చేసుకున్న అతిలోకసుందరి శ్రీదేవి..

Latest Cinema news

సినిమాలో తన దుస్తులు తానే డిజైన్ చేసుకున్న అతిలోకసుందరి శ్రీదేవి..

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమాల లిస్ట్ చెప్పమంటే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా పేరు ఆ లిస్ట్‌లో ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దేవకన్యగా, అతిలోకసుందరిగా అందాల నటి శ్రీదేవి నటించగా; జగదేకవీరునిగా, ఒక టూర్ గైడ్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. 1990లో విడుదలైన ఈ సినిమా 33 ఏళ్లు పూర్తైనా దీనికి ఉన్న చరిష్మా మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరడం లేదు. అందుకే ఈ సినిమా తెలియని వారు నేటి తరం పిల్లల్లోనూ ఎవరూ ఉండరంటే అది అతిశయోక్తి అస్సలు కాదు.

అంతేకాదు.. ఈ సినిమాకు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కోకొల్లలు. అయితే ఇంతగా ఆదరణ పొందుతున్న ఈ చిత్రం వెనుక ఎంత కథ ఉందో; వారు ఎంత శ్రమించారో చిత్రబృందం ఓ వీడియో రూపొందించి దానికి ప్రముఖ నటుడు, న్యాచురల్ స్టార్ నానీ గొంతుతో సినీ అభిమానులకు వినిపించారు. అది విన్న ప్రతిఒక్కరూ ‘అరె.. ఈ సినిమా కోసం అంత కష్టపడ్డారా? సినిమా విడుదలయ్యాక రాఘవేంద్రరావు, అశ్వనీదత్ అంత భయపడ్డారా?’ అని అనుకోక మానరు.

రాఘవేంద్రరావు గారికి సోషియో ఫాంటసీ ఒకటి తెరకెక్కించాలనే ఆలోచన రావడంతో దాని కోసం కథని వెతకడం మొదలుపెట్టారు. అలా ఓ రచయిత రాసుకున్న అవుట్‌లైన్.. మానవుడు.. దేవకన్య.. భూలోకం.. దేవలోకం.. వీటి కలయికలో ఓ స్టోరీ దొరికింది.. అవుట్‌లైన్ నచ్చింది కానీ కథ ఆయనకు అంతగా ఆసక్తి అనిపించలేదు. దాంతో ఆ కథను తీసుకొచ్చి మన సినీపరిశ్రమలో రచయితలుగా చేయితిరిగిన వారి చేతిలో పెట్టారు. కథానాయకుడిగా చిరంజీవి అని ముందే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి కథ ఆయనకు అనుగుణంగా రాయించాలని నిర్ణయించుకున్నారు. అలా జగదేకవీరుడు అతిలోకసుందరి కథ ఆరుగురు రచయితలు కలిసి రాశారట. అలాగే కథకు భూలోకవీరుడు అని పేరు పెట్టుకున్నారు మొదట్లో.

ఇక, కథానాయికగా శ్రీదేవిని ఎంపిక చేసుకున్న తర్వాత సినిమా టైటిల్ మార్చక తప్పదని దర్శక, నిర్మాతలకు అర్థమైంది. అందుకే ఆమె ఇమేజ్‌కు తగ్గట్లుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ అని పేరు మార్చారు. ఈ పేరు పెద్దదిగా ఉంది, ఇంత పెద్ద పేరు పెడితే సినిమాలు ఎవరు చూస్తారు.. అని కూడా అప్పట్లో కొందరు చెవులు కొరుక్కున్నారట. కానీ టీం ఇవేవీ పట్టించుకోకుండా చిత్రీకరణ జరిపింది. ఇక ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి పాత్రకు ధరించిన దుస్తులు కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అవి స్వయంగా శ్రీదేవే ఎంపిక చేసుకునేవారట. ఒక్కోసారి లుక్‌కు అనుగుణంగా ఉండాలి చిన్న చిన్న మార్పులు చేర్పులు తానే చేసుకుని స్వయంగా డిజైన్ కూడా చేసుకునేవారట. మే 9న ఈ సినిమా విడుదల చేయాలని భావించారు మేకర్స్. కానీ మే 6 కి యావత్ ఆంధ్రప్రదేశ్ తుఫాన్‌ భీభత్సంతో అతలాకుతలం అయిపోయింది. అయినా సరే.. సినిమా రిలీజ్ ఆగే ప్రసక్తే లేదు. విశ్వప్రయత్నాలు చేసి, శ్రమకోర్చి సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేసేశారు.

READ ALSO  శ్రీజ బాట పట్టబోతున్న మరో మెగా డాటర్…..

సినిమా అయితే రిలీజ్ అయింది. కానీ తుఫాన్ కారణంగా నీళ్లతో నిండిపోయి, మొత్తం చెల్లాచెదురుగా ఉన్న వాతావరణంలో సినిమాను ఎవరు ఆదరిస్తారు? అలాంటి సమయంలో థియేటర్‌కు ఎవరు వెళ్లి సినిమా చూస్తారు అన్న ప్రశ్న, సందేహం దర్శక, నిర్మాతలను వెంటాడాయి. అందుకే తుఫాన్ తాకిడి తగ్గిన వెంటనే అంటే మే 11న వారు విజయవాడకు బయల్దేరి వచ్చారు. అక్కడికి వచ్చి పరిస్థితులు చూసి ఒక అంచనాతో, సినిమా ఫలితం ఏమవుతుందో అన్న రకరకాల భయాలతో థియేటర్స్‌కు వెళ్లి చూద్దామని అనుకున్నారు. అలా థియేటర్‌కు వెళ్లి చూశాక వారి ఆలోచనలు మారిపోయాయి. సందేహాలు ఫటాపంచలైపోయాయి. చప్పట్లు, విజిల్స్‌తో ఫుల్ థియేటర్ మార్మోగిపోతోంది. ఇక దారిలో ఓ రైతు ఎదురై సినిమా హిట్ అని చెప్పేసరికి ఇంకాస్త బలం వచ్చినట్లైంది. మరో థియేటర్‌కు వెళ్లి చూద్దామని వెళ్తుండగా; తుఫాను బాధిత ప్రాంతాలను సందర్శిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వీరికి దారిలో ఎదురయ్యారు. సినిమా బాగుందని టాక్ వచ్చింది. మీరేం భయపడకండి. అన్నీ సర్దుకుంటాయ్.. అని చెప్పారట. అన్నట్లుగానే మెల్లగా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. మెగాస్టార్ సత్తా ఏంటో యావత్ భారతదేశానికి తెలిసేలా చేసింది. చిరు-శ్రేదేవిల కెమిస్ట్రీ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

google news
Continue Reading
To Top