అభిమానులను ఆకట్టుకుంటున్న ‘మై డియర్ మార్కండేయ..’ బ్రో లిరికల్ సాంగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ది అవతార్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. తమిళంలో రూపొందిన వినోదయ సీతమ్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులోనూ తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంటున్నారు మేకర్స్. ‘బ్రో’ సినిమాకు తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా; పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను ఇప్పటికే విడుదల చేసిందీ చిత్ర బృందం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వరుసగా సినిమాలోని పాటలను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ‘మై డియర్ మార్కండేయ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఇందులో మార్కండేయ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నారు. పాటలో కూడా పార్టీ తరహా ఎంజాయ్‌మెంట్‌తో ఓ ఊపు ఊపుతోంది.

మరోవైపు ఈ చిత్రాన్ని జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సైతం టీం ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికే వారాహి విజయయాత్రను కొనసాగిస్తున్న పవన్ ఈ ఈవెంట్‌కు రాకపోవచ్చేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా రావచ్చని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ విషయమై టీం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం తాజాగా విడుదల చేసిన మై డియర్ మార్కండేయ సింగిల్ మాత్రం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. పవన్ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ సాంగ్‌ రిలీజ్‌తో సంతోషిస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అలాగే బ్రూ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ అందించిన స్వరాలు మాత్రం అల్టిమేట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

google news

Leave a Comment