మెగా అభిమానులకు మాస్ లెవల్లో ట్రీట్ ఇస్తున్న భోళాశంకర్..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ అంతటా మెగా మేనియానే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.. ఓ వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో; ది అవతార్’ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా; దానికి ఒక్క రోజు ముందుగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 2.25సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మెగా అభిమానులను ఫుల్ ఖుషీ చేసేస్తోంది.

ప్రారంభంలోనే హౌరా బ్రిడ్జి పై అమ్మాయిలు మిస్సింగ్ అంటూ కథ మొదలవ్వడం.. పోలీసులకు సైతం వాటి అంతు చిక్కకపోవడం.. సహాయం నిమిత్తం భోళా భాయ్‌ని ఆశ్రయించడం.. భోళాశంకర్ పరిచయం.. ఇలా ట్రైలర్ అంతా చాలా ఉత్సాహకరంగా సాగుతుంది. ఇక ఈ చిత్రంలో ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి కనిపిస్తే; మిల్కీ బ్యూటీ తమన్నా అడ్వకేట్‌గా దీపిక అనే పాత్రలో మెరవనుంది. ‘రంగస్థలంలో రామ్‌చరణ్ బాబులా చేస్తున్నాడురా..’ అంటూ ఆమె చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో మెగా అభిమానులను విజిల్స్ వేయించేలా ఉన్నాయి.

ఇక భోళాశంకర్ చెల్లెలు రాధ పాత్రలో కీర్తిసురేష్ చాలా కీలకమైన రోల్ ప్లే చేసిందని అర్థమవుతోంది. అయితే కథలో ఈమె శంకర్‌ దత్తత తీసుకున్న చెల్లి కావడం గమనార్హం. ఇక ఈమెని ప్రేమిస్తున్న వ్యక్తిగా భాస్కర్.. అదేనండీ.. మన అక్కినేని సుశాంత్ పాత్ర ఉంటుంది. ఈయన దీపిక (తమన్నా)కు అన్నయ్య కూడా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా చిరు లీక్స్ పేరిట చిరంజీవి విడుదల చేసిన వీడియో ద్వారా యాంకర్ రష్మి ఇందులో ఉన్నట్లు కన్ఫర్మ్ అవ్వగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌తో శ్రీముఖి కూడా ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. అంతేకదా.. చిరంజీవి, శ్రీముఖి పాత్రల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం కూడా మేకర్స్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక ట్రైలర్ చివరిలో పవన్ మేనరిజం చిరు అనుకరించడం కూడా మనం గమనించవచ్చు.

సినిమాలో బలమైన హీరో పాత్రకు అంతకంటే బలమైన విలన్స్ చాలా అవసరం. అందుకే ఈ సినిమాలో తరుణ్ అరోరా, రవి శంకర్.. తదితరులు ఆయా పాత్రలు పోషించారు. ఇక ట్రైలర్‌లో ఒక సీన్‌లో కీర్తిసురేష్ (రాధ) పై కూడా దాడి జరిగినట్లు చూపించారు. మరి, ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ కిడ్నాప్స్‌ కథేంటి? వాటిని భోళా భాయ్ ఎలా ఛేదించారు?? అనేదే ప్రధాన కథ అని చెప్పచ్చు. ఇక రఘుబాబు, మురళీశర్మ, తులసి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను.. తదితరులంతా ఈ చిత్రంలో కనిపించనున్నారని ట్రైలర్ చూసి చెప్పేయచ్చు. మొత్తంగా మెగాస్టార్ మరోసారి మెగా అభిమానులందరికీ మెగా ఫీస్ట్ ఇచ్చేందుకు రడీ అయిపోయినట్లే..

google news

Leave a Comment