తెలుగు సినీ పరిశ్రమలో 17 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఈ మాట బాగా వర్తిస్తుంది. సాధారణంగా కథానాయికలు చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక వరుసగా అవకాశాలు వచ్చినంత వరకు పని చేయడం.. ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకోవడం.. షరా మామూలే. హీరోలకు వయసు పైబడినా ఆరాధించే అభిమానులు.. హీరోయిన్లను మాత్రం అలా ఎందుకు వెండితెర పై ఆరాధించలేరో ఇప్పటికీ అర్థం కాని విషయమే. అయితే కొందరు నటీమణులకు మాత్రం ఈ వ్యాఖ్యలు అంతగా వర్తించవు. ఎందుకంటే వారు తమ నటన పైనే దృష్టి పెడుతూ వరుసగా తమ సినిమాలు తాము చేసుకుంటూ వెళ్తారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇదే కోవకు చెందుతుంది.
ప్రస్తుతం తమన్నా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కథానాయికగా లాయర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ టీం. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ మెగాస్టార్ లవ్ ఇంట్రస్ట్ అంటే ఆ పాత్రకు తమన్నా అనే ముందు నుంచీ అనుకున్నాం. ఇంకా చెప్పాలంటే తమన్నాతో మాట్లాడి కన్ఫర్మ్ కూడా చేసుకోకుండానే ఆమె పేరుతోనే కథను చెప్పేవాడిని. హీరోయిన్ రోల్ గురించి ఎవరికి వివరించినా కూడా పాత్ర పేరుతో కాకుండా తమన్నా పేరునే వాడేవాడ్ని. అంతలా మేమంతా ఆ పాత్రకు ఆమెను ఫిక్స్ అయిపోయాం. మేము అడగిన వెంటనే ఆమె అంగీకరించినప్పుడు మా సంతోషం అంతా ఇంతా కాదు అన్నారు మెహర్ రమేష్.
ఇదే విషయమై తమన్నా మాట్లాడుతూ – ‘ఈ పాత్ర నాకు లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిరంజీవి సరసన హీరోయిన్ అంటే ఖచ్చితంగా ఆ పాత్రకు ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నా క్యారెక్టర్‌కు ఆయన రాసుకున్న కథను చెప్తున్నప్పుడు ఆ కథకు నేను చాలా కనెక్ట్ అయ్యాను నేను సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కూడా కథే. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నీ కెరీర్‌లో నువ్వు ఎవరిలా అవుతావ్? ఎవరిని చూసి ప్రేరణ పొందుతావు? అని అడిగితే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి అనే చెప్తా నేను. ఆయన్నుంచి డెడికేషన్, కమిట్‌మెంట్, పెర్ఫార్మెన్స్ క్లారిటీ… ఇలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
భోళాశంకర్‌లో ఓ పాట షూట్ చేస్తున్న రోజు చిరంజీవి గారెకి మోకాలి నొప్పి ఉంది. అయినా సరే.. షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆయన షూట్‌కు వచ్చారు. రావడమే కాదు.. అసలు ఎలాంటి నొప్పి లేదన్నట్లుగానే స్టెప్స్ వేసి అందరినీ మెస్మరైజ్ చేశారు. కానీ ఆయనకు ఎంత నొప్పి వస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే ఆయనకు దగ్గర్లోనే ఉండి, కళ్లారా చూస్తున్నా.. ఆయన మాత్రం అవేవీ లెక్క చేయకుండా షూటింగ్ మీద మాత్రమే ధ్యాస పెట్టారు. అది కదా అసలు డెడికేషన్ అంటే అనిపించింది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.