Connect with us

వెంకటేష్ చేయాలనుకున్న ‘అహ నా పెళ్లంట..’ రాజేంద్రప్రసాద్‌కు ఎలా వెళ్లింది?

Latest Cinema news

వెంకటేష్ చేయాలనుకున్న ‘అహ నా పెళ్లంట..’ రాజేంద్రప్రసాద్‌కు ఎలా వెళ్లింది?

ప్రశ్న ఏది అడిగినా… ఎవరు అడిగినా.. ‘నాకేంటి??.. హ.. చెప్తే నాకేంటి??’ అనే పాత్ర మీకు గుర్తుందా? ఇప్పటికీ పిసినారి సంఘానికి అధ్యక్షుడు అనగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చే పాత్ర ‘లక్ష్మీపతి’. కోటా శ్రీనివాసరావు పోషించిన ఈ పాత్ర సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఎవర్ గ్రీన్ రోల్స్‌లో ఒకటి. రామానాయుడు నిర్మాణ సారధ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అహ నా పెళ్లంట’. దాదాపు 16 లక్షల  రూపాయల బడ్జెట్‌తో రూపొంది అంతకు మించిన 15 రెట్లు వసూళ్లతో దాదాపు 5 కోట్ల రూపాయల వరకు వసూళ్లను రాబట్టిన చిత్రం ఇది. పూర్తి స్థాయి హాస్యాస్పద చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమాలకు ఇది ఆది వంటిది.

వరుసగా కమర్షియల్ చిత్రాలకు పరిమితమైపోయిన రామానాయుడుగారు ఓసారి ఒక జోక్ చదివి బాగా నవ్వుకున్నారట. ఒకటికి నాలుగు సార్లు అదే జోక్ తలుచుకుంటూ నవ్వుకుంటున్న సమయంలోనే ఆయనకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చిందట. మనం కాసేపు నవ్వుకుంటేనే ఇంత హాయిగా ఉంది. మరి, థియేటర్‌లో ప్రేక్షకులు ఇలా నవ్వుకుంటే?? అబ్బ.. ఎంత బాగుంది.. అనుకున్నారట. అనుకున్నదే తడవుగా.. హాస్యానికి పెట్టింది పేరైన జంధ్యాల గారెకి కబురు పెట్టారట. వెంటనే ఆయన కూడా రామానాయుడి గారిని కలుసుకోవడం.. మనసులో మెదిలిన ఆలోచనను ఆయనకు చెప్పడం.. చకచకా జరిగిపోయాయి.

అయితే అప్పటికే ఆదివిష్ణు అనే రచయిత వద్ద కథ సిద్ధంగా ఉండడంతో అదే కథకు అదనపు హంగులు చేర్చి రడీ చేసి దానినే వినిపించారట జంధ్యాల. లక్ష్మీపతి అనే పిసినారి తండ్రి పాత్ర, అతని వద్ద ఉండే ఒక సహాయకుడి పాత్ర రామానాయుడికి బాగా నచ్చేశాయి. కథ వెంటనే ఓకే అయిపోవడంతో హీరోగా రాజేంద్రప్రసాద్, హీరోయిన్‌గా రజని.. తదితరులను ఎంపిక చేసుకున్నారు. ఇక లక్ష్మీపతి పాత్రకు మొదట రావుగోపాల రావు గారిని అనుకున్నా అది చివరికి కోటా శ్రీనివాసురావు గారెకి దక్కింది. అలాగే ఆయన సహాయకుడి పాత్ర కూడా సుత్తి వేలు అనుకుని ఫిక్స్ చేసేసుకున్నారు కూడా. కానీ షూటింగ్ దగ్గరపడిన సమయంలో డేట్స్ ఇష్యూ రావడంతో అతని స్థానంలో బ్రహ్మానందాన్ని తీసుకున్నారట. అలా లక్ష్మీపతి, అరగుండు పాత్రలు యాధృచ్ఛికంగా సెట్ అయ్యాయన్నమాట.

అయితే లక్ష్మీపతి పాత్ర పెట్టుకునే కళ్లజోడు అద్దం పగిలి, ఫ్రేమ్ విరిగి ఉండడం, అరగుండు పాత్ర నత్తిగా మాట్లాడడం.. ఇవన్నీ జంధ్యాల గారు సెట్‌లో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలేనట. వాస్తవానికి ఈ సినిమా చేయడానికి విక్టరీ వెంకటేష్ కూడా ఓకే చెప్పారట. కానీ ఆ కథ రాజేంద్రప్రసాద్‌కు అయితే చాలా బాగుంటుంది.. ఆయన్నే చేయనీ అని రామానాయుడు గారు అనడంతో వదిలేశారట. ఏది ఏమైనా ఎవరికి వారే తమ పాత్రలతో సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వులు పూయిస్తూనే ఉన్న చిత్రం అంటే 1987లో విడుదలైన ‘అహ నా పెళ్లంట’ పేరు తప్పక వినిపిస్తుంది.

READ ALSO  మన తెలుగు డైరెక్టర్లు తీసిన అదిరిపోయే సినిమాలు ఇవే
google news
Continue Reading
To Top