నేహా శెట్టి.. డీజే టిల్లు సినిమాతో బాగా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ భామ. 2016 లో ముంగరు మాలే 2 సినిమాతో కన్నడలో తెరంగేట్రం చేసినా ఆ తర్వాత 2018 లో ‘మెహబూబా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. వంటి సినిమాల్లో నటించిన ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కలేదు. అయితే గతేడాది అంటే 2022లో ఆమె సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన డీజే టిల్లు సినిమాతో తొలి హిట్ అందుకుంది. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో కాస్త బిజీగానే ఉంది నేహ.
కార్తికేయ గుమ్మకొండతో కలిసి బెదురులంక 2012 సినిమాలో నటిస్తుండగా; కిరణ్ అబ్బవరంతో కలిసి రూల్స్ రంజన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలకు చెందిన పాటలు వరుసగా విడుదలవుతుండడంతో వాటితో ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోందీ సుందరి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో కాసేపు ముచ్చటిస్తూ కూడా ఉంటుంది నేహ. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిపిన చిట్ చాట్‌లో పలువురు నెటిజన్లు/ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చారు.
డీజే టిల్లు సినిమాలో మీకు ఇష్టమైన సీన్ ఏదని అడగ్గా… దానికి ఎప్పటికీ సమాధానం చెప్పలేనని, ఎందుకంటే ఆ సినిమాలో సీన్లన్నీ తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చిందీ భామ. అలాగే ఆ సినిమా చూసి చాలాసార్లు నవ్వుకుందట నేహ. ఇక మరొకరు మీరు కారు బాగా డ్రైవ్ చేస్తారా అని అడిగితే తనకి తెలిసినంత వరకు తానొక మంచి డ్రైవర్‌ని అని చెప్పుకొచ్చింది. తర్వాత ఆమె నటిస్తున్న రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ డేట్ గురించి అడగ్గా; త్వరలో టీం దానిని ప్రకటిస్తుందని, ప్రస్తుతం ఆ సినిమా నుంచి విడుదలైన పాటకు వస్తున్న రెస్పాన్స్ చూసి తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
మీరెన్ని భాషలు మాట్లాడగలరు అని మరొక నెటిజన్ ఆమెను ప్రశ్నించగా కన్నడ, హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తుళు భాషలని సమాధానమిచ్చింది. తమిళంలో మీరు సినిమా చేస్తారా అని అడగ్గా కోలీవుడ్‌లో త్వరలో ఒక సినిమా గురించి ప్రకటిస్తా అంది నేహ. ఇంకో నెటిజన్ మీరెప్పుడు రిటైర్ అవ్వాలని అనుకుంటున్నారు అని అడగ్గా.. దానికి ఈ అమ్మడు నేనప్పుడే మీకు బో కొట్టేసానా అంటూ చమత్కరించింది. మొత్తానికి తన చక్కని సమాధానాలతో ఈ అమ్మడు బ్యూటీ విత్ బ్రెయిన్ హీరోయిన్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంటుందనే చెప్పచ్చు. ఏమంటారు??