మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ.. అంటూ వచ్చేస్తున్న భోళాశంకర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం నుంచి జామ్ జామ్ జజ్జనక  అంటూ సాగే రెండో పాట విడుదలైన అతి కొద్దిరోజుల్లోనే మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది మూవీ టీం. మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ.. అంటూ సాగే ఈ పాట కూడా ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నట్లుగానే అనిపిస్తోంది. ఈ రెండు లైన్స్ విన్న అభిమానులు పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. అయితే పూర్తి పాటను రేపు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రబృందం.

ఇంతకు ముందు విడుదల చేసిన జామ్ జామ్ జామ్ జజ్జనక.. పాట కేవలం వినడానికే కాదు.. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తిసురేశ్, అక్కినేని సుశాంత్.. లతో స్క్రీన్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా మెరిసిపోయింది. ఇక మాస్ బీట్‌కి వీరేసిన స్టెప్స్ కూడా ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతేకాదు.. ఈ పాటలోనే ప్రాచుర్యం పొందిన తెలంగాణ జానపద గీతం అయిన నర్సపెల్లె పాటకు నర్సపెల్లె గండిలోన గంగధారి.. నాటుపిల్లే కలిసినాది గంగధారి అంటూ మరో కొత్త వెర్షన్ కూడా వినిపించారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లి, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది.

అందుకే ఈ సినిమాలోని ఒక్కో పాటను వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు మూవీ టీం. అలాగే ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళాశంకర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాటతో అభిమానులంతా ఇంకా భోళా మానియాలో ఉండగానే జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే ఈ పాటతో ఒకేసారి పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోయారంతా. ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ సాంగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కథానాయికగా తమన్నా నటిస్తుండగా; చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. అక్కినేని సుశాంత్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పని కూడా ఇటీవలే పూర్తైనట్లు సోషల్ మీడియా వేదికగా అందరితోనూ పంచుకున్నారు.

google news

Leave a Comment